బేట్రాయి సామి దేవుడా - నన్నేలినోడ
బేట్రాయి సామి దేవుడా
కాటేమి రాయుడా - కదిరినరసిమ్మడా
మేటైన వేటుగాడ నిన్నే నమ్మితిరా
మేటైన వేటుగాడ నిన్నే నమ్మితిరా
బేట్రాయి...
శాప కడుపు సేరి పుట్టగా - రాకాసిగాని
కోపామునేసి కొట్టగా
ఓపినన్ని నీల్లలోన వలసీ వేగామె తిరిగి
బాపనోల్ల సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ
బేట్రాయి...
తాబేలై తాను పుట్టగా ఆ నీల్లకాడ
దేవాసురులెల్లకూడగా
దోవసూసి కొండకింద దూరగానే సిల్కినపుడు
సావులేని మందులెల్ల దేవర్లకిచ్చినోడ
బేట్రాయి...
అందగాడనవుదులేవయా - గోపాల గో
విందా రచ్చించా బేగరావయా
పందిలోన సేరి కోర పంటితోనె ఎత్తి భూమి
కిందు మిందు సేసినోడ సందమామ నీవె కాద
బేట్రాయి...
నారసిమ్మ నిన్నె నమ్మితి - నానాటికైన
కోరితి నీ పాదమే గతీ
ఓరి నీవు కంబాన సేరి ప్రహ్లాదు గాచి
కోరమీస వైరిగాని గుండె దొర్లసేసినోడ
బేట్రాయి...
బుడుత బాపనయ్యవైతివి
ఆ శక్కురవరితి నడిగి భూమి నేలుకుంటివీ
నిడువు కాళ్ళోడివై అడుగు నెత్తిపైన బెట్టి
తడవు లేక లోకమెల్ల మెడిమతోటి తొక్కినోడ
బేట్రాయి...
రెండుపదులు ఒక్కమారుతో ఆ దొరలనెల్ల
సెండాడినావు పరశుతో
సెండకోల బట్టి కోదండరామసామికాడ (సెండకోల = గండ్రగొడ్డలి)
బెండు కోల సేసికొనీ కొండకాడకేగినోడ (బెండు కోల = శక్తి తగ్గించుకుని, సముద్రం దగ్గర గొడ్డలి విసిరేసి అంత మేరా సముద్రాన్ని వెనక్కి
జరిపిన ఘట్టం)
బేట్రాయి...
రామదేవ రచ్చించరావయా సీతమ్మతల్లి
శ్యామసుందర నిన్ను మెచ్చగా
సామి తండ్రిమాట గాచి ప్రేమ భక్తినాదరించి
ఆమైన లంకనెల్ల దోమగాను సేసినోడ
బేట్రాయి...
దేవకీదేవి కొడుకుగా ఈ జగములోన
దేవుడై నిలిచినావురా
ఆవూల మేపుకొనీ ఆడోళ్ళాగూడుకొనీ
తావుబాగ సేసుకొనీ తక్కిడి బిక్కిడి సేసినోడ (తక్కిడి బిక్కిడి = మోసం)
బేట్రాయి...
ఏదాలూ నమ్మరాదనీ ఆ శాస్త్రాలా
వాదాలూ బాగ లేవనీ
బోధనలూ సేసికొనీ బుద్ధూలు సెప్పుకొనీ
నాదావినోదుడైన నల్లనయ్య నీవెకాద
బేట్రాయి...
కలికి నా దొరవు నీవెగా ఈ జగములోన
పలికినావు బాలశిశువుడా
చిల్లకట్టు పురములోన సిన్నీ గోపాలుడౌర
పిల్లంగోవి సేతబట్టి పేట పేట తిరిగినోడ..
బేట్రాయి...
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon