చినుకులా రాలి నదులుగా సాగి పాట లిరిక్స్ | నాలుగు స్తంభాలాట (1982)

 చిత్రం : నాలుగు స్తంభాలాట (1982)

సంగీతం : రాజన్-నాగేంద్ర

సాహిత్యం : వేటూరి

గానం : బాలు, సుశీల


చినుకులా రాలి నదులుగా సాగి

వరదలై పోయి కడలిగా పొంగు

నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ

నదివి నీవు కడలి నేను

మరిచిపోబోకుమా 

మమత నీవే సుమా

 

చినుకులా రాలి నదులుగా సాగి

వరదలై పోయి కడలిగా పొంగు

నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ

 

ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే

కుంకుమ పూసే వేకువ నీవై తేవాలి ఓదార్పులే

ప్రేమను కోరే జన్మలలోనే నే వేచి ఉంటానులే

జన్మలు తాకే ప్రేమను నేనై నే వెల్లువవుతానులే 

నీ నవ్వులే చాలులే

 

హిమములా రాలి సుమములై పూసి

రుతువులై నవ్వి మధువులై పొంగు

నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ

శిశిరమైనా శిధిలమైనా విడిచిపోబోకుమా

విరహమై పోకుమా

 

తొలకరి కోసం తొడిమను నేనై అల్లాడుతున్నానులే

పులకరమూగే పువ్వుల కోసం వేసారుతున్నానులే 

నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే

నిన్నలు నేడై రేపటి నీడై నా ముద్దు తీరాలిలే

ఆ తీరాలు చేరాలిలే

 

మౌనమై మెరిసి గానమై పిలిచి

కలలతో అలిసి గగనమై ఎగసి

నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ

భువనమైనా గగనమైనా 

ప్రేమమయమే సుమా

ప్రేమ మనమే సుమా 

చినుకులా రాలి నదులుగా సాగి

వరదలై పోయి కడలిగా పొంగు

నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ

Share This :



sentiment_satisfied Emoticon