పాటల సిరి వేటూరి వర్ధంతి నేడు








వేదం, నాదం, శాస్త్రం మూడు విభూది రేఖలుగా తెలుగుజాతి కీర్తి పతాకమై విరాజిల్లే పెదకళ్లేపల్లి గడ్డపై వేటూరి సుందరరామ్మూర్తి పుట్టారు. వేటూరి చంద్రశేఖర శాస్త్రి - కమలమ్మ దంపతులకు 1936 జనవరి 29వ తేదీన పెదకళ్లేపల్లి గ్రామంలో వేటూరి సుందరరామ్మూర్తి జన్మించారు. వేటూరి కవిని కన్నతల్లి గర్భంబు ధన్యంబు అని జాషువా చెప్పినట్లు ఆయన తల్లి 40 ఏళ్ల వయస్సులో నవమాసాలు మోసి మూడురోజులపాటు ప్రసవ వేదన భరించి ఈ కవి రత్నాన్ని ఆంధ్రజాతికి అందించింది. తెలుగు సాహితీ దిగ్గజాల్లో ఒకరైన వేటూరి ప్రభాకరశాస్త్రి ఈయన పెద్దనాన్న.


స్వరాలకు పద సౌందర్యాన్ని అద్ది, సాహిత్య సామ్రాజ్యంలో ప్రకాశింపచేసిన మూర్తి వేటూరి 18 ఏళ్ల ప్రాయంలోనే కలం పట్టుకుని పత్రికా రంగంలో ప్రవేశించారు. 1962లో నాటి ప్రధాని నెహ్రూ శ్రీశైలం విచ్చేసిన సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు.

ఆంధ్ర జనతా పత్రికలో ఎడిటర్‌గా ఎదిగి, భద్రాచలం సమీపంలోని పాల్వంచ వద్ద జరిగిన ఒక బహిరంగ సభలో నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పొరపాటుగా మాట్లాడిన అంశాన్ని బాక్స్‌ ఐటమ్‌గా ఇచ్చి సంచలనం సృష్టించిన ధైర్యవంతుడు వేటూరి. ఈయన కలం నుంచి జాలువారి, ఆంధ్రదేశాన్ని ఒక ఊపు ఊపిన ‘సిరికాకుళం చిన్నది’ గేయ రూపకాన్ని సినీ దర్శకుడు విశ్వనాథ్‌ విని, తొలిసారిగా ఓ సీత కథ చిత్రంలో వేటూరికి అవకాశం కల్పించారు. నాటి నుంచి వేటూరి సినీ వినీలాకాశంలో ఎంతో ఎత్తుకు ఎదిగారు.


ఈయన మది నిండా భావాలే. ఈయన పెదవి విప్పితే మాట పాటై ఎదుట నిలుస్తుంది. ఈయన కలానికి పదునూ, వేగం రెండూ ఎక్కువే. అందుకే ఆయన 1974 నుంచి 1800 తెలుగు సినిమాలకు ఆరు వేల పాటలను అందించి, తనదైన ఇజాన్ని సృష్టించుకున్నారు. నంది సహా ఎన్నో జాతీయ స్థాయి అవార్డులను అందుకున్నారు.


మాతృ భాషాభిమాని


మాతృదేవోభవ చిత్రంలో రాలిపోయే పువ్వా...నీకు రాగలెందుకే అంటూ రాసిన గీతానికి వేటూరి సుందరరామ్మూర్తికి జాతీయ అవార్డు ప్రకటించారు. తెలుగు భాషకు ప్రాచీన హోదా ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన ఆయన, తెలుగు భాషకు లేని గుర్తింపు పాటలకెందుకంటూ అవార్డును తిరస్కరించి తన భాషాభిమానాన్ని చాటుకున్నారు.




తెలుగు పాటకు వన్నెలద్ది, సంస్కృత సమాసాలనైనా, సరస పదాలనైనా అలవోకగా లిఖించిన వేటూరి, 2010 మే22న పాటల పల్లకిలో ఊరేగుతూ గంధర్వ లోకాలకు వెళ్లిపోయారు. ఆయన భౌతికంగా కనుమరుగైనా, తెలుగు వారి గుండెల్లో పాటై, నట్టింట్లో కూనిరాగమై నిలిచే ఉంటారు.



Share This :



sentiment_satisfied Emoticon