కిన్నెర నృత్యము కవిత కిన్నెరసాని పాటలు
కవితా సంకలనం :: కిన్నెరసాని పాటలు
రచయిత :: విశ్వనాథ సత్యనారాయణ
కవిత పేరు ::కిన్నెర నృత్యము
కెరటాలలో నుర్వు
తెర చాలులో నీటి
పొరజాలులో కిన్నె
రటు కదలి యిటు కదలి
చిటితరంగాలతో పొటితరంగాలతో
నటనాలు మొదలెట్టెనే క్రొన్నీటి
తుటుములా కదలాడెనే
పువుకన్నెలా జగా
రవ నవ్వులా వేల్పు
కవ చివ్వలా కిన్నె
రటు లూగి యిటు లూగి
చిటిలు కెరటాలతో పెటిలు కెరటాలతో
జవ్వుజవ్వున నూగెనే తెలిమల్లె
పువ్వురువ్వులు పోయెనే
చిఱుగాలిలో నూగు
కొఱవంపుతో నీటు
తరితీపులో కిన్నె
రటు లేచి యిటు లేచి
జల్లుతుంపురులతో కొల్లతుంపురులతో
మెల్ల మెల్లన నాడెనే కెరటాల
జల్లులో ముంచెత్తెనే
నడినీటిలో మేలి
జడసందులో నీటి
ముడిపొందులో కిన్నె
రటు పొంగి యిటు పొంగి
రంగారు నలలతో పొంగారు నలలతో
చెంగు చెంగున దూకెనే క్రొంగ్రొత్త
సింగారములు వొలికినే
సురగాలిలో పొంగు
తరగాలిలో నీటి
తెరడాలులో కిన్నె
రటు పొరలి యిటు పొరలి
పరుగెత్తు నురుగుతో దరులొత్తు నురుగుతో
గల్లుగల్లున మ్రోగెనే జల్లు మని
వెల్లువల్ విరజిమ్మెనే
సొనజారుతూ నీటి
పనవాలుతూ అండ
మున సోలుతూ కిన్నె
రటు చెదరి యిటు చెదరి
చిన్నారి నడలతో పొన్నారి నడలతో
వన్నె వన్నెలు పోయెనే కిన్నెరా
క్రొన్నెలా తళు కొప్పెనే
చిఱు తేనెలా అచ్చ
రల గొంతులా గజ్జి
యల మ్రోతలా కిన్నె
రటు మొరసి యిటు మొరసి
గలగలారవళితో జలజలారవళితో
మెల్లగా నూగాడెనే కెరటాల
జల్లుగా ముసురెత్తెనే
తెగ పాడుతూ అంద
ముగ నాడుతూ తేనె
వగలోడుతూ కిన్నె
రటు వాలి యిటు వాలి
తళుకు వాకలతోడ బెళుకువాకలతోడ
మలకలై నటియించెనే తెలినీటి
పులకలై బుగ్గెత్తెనే
లయ పెంచుతూ మధ్య
లయ దించుతూ పాట
రయ మెంచుతూ కిన్నె
రటు సోలి యిటు సోలి
తెలి నీటిమేనితో తలిరాకు మేనితో
ఒయ్యారములు పోయెనే కిన్నెరా
అయ్యారె యనిపించెనే
ధణధంగిణాం దధోం
గిణ తక్కిణాం మద్దె
లల మ్రోతలై కిన్నె
రటు మ్రోగి యిటు మ్రోగి
చిఱు లొల్గుసోనలై సిరులొల్కు సోనలై
మృదు తాండవము చేసెనే వనవీథి
పదువు పాయలు కట్టెనే
ఘలు ఘల్లునా వెల్లు
వల పెల్లునా కొల్ల
వలి జల్లునా కిన్నె
రటు త్రొక్కి యిటు త్రొక్కి
గిలుకు టందియలునా తళుకు టందియలునా
అలల నురుసులు తోచెనే ఆమధ్య
జలజలా పొంగెత్తెనే
జిగి బెళ్కులా ధగా
ధగ తళ్కులా జగా
జిగికుల్కులా కిన్నె
రటు నవ్వి యిటు నవ్వి
అలల పెన్నురుసుతో సెలల పెన్నురుసుతో
తెలుగు వొదుగులు పోయెనే కిన్నెరా
తెలుగు తీపులు చిమ్మెనే
తెలి నుర్వులో చెమ్మ
టలు చిమ్ముతూ అలస
టలు క్రమ్ముతూ కిన్నె
రటు సొక్కి యిటు సొక్కి
చిఱుమీను కనులతో శ్రమ మీను కనులతో
సోగతనములు వోయెనే లోగొంతు
రాగాలు వెలయించెనే
తమికోనలో మిటా
రము క్రక్కుతూ నిగా
రము లొల్కుతూ కిన్నె
రటు లెగిరి యిటు లెగిరి
ననమేని వంపుతో నును మేని ముంపుతో
కాలిగజ్జెలు మ్రోగెనే జఱ్ఱు మని
క్రాలు కెరటాల్ చిందెనే
అల కోనలో మంచు
వలి సోనలో వెల్లు
వల వానలో కిన్నె
రటు లోడి యిటు లోడి
రస మేలు రూపుతో పసమేలు రూపుతో
సొగసు వంపులు వంగెనే వెన్నెలా
చిగురు మంపులు సూపెనే
తలి రోర్పుతో నీటి
యలలూర్పుతో అంద
ముల మార్పుతో కిన్నె
రటు తూగి యిటు తూగి
బిగువు టందాలతో నగవు టందాలతో
నిండుగా ప్రవహించెనే పువ్వుల్ల
చెండులా చెలు వొలికినే
చిఱురాలపై మిఱ్ఱు
లగు నేలపై మెట్ట
లగు చేలపై కిన్నె
రటు దూకి యిటు దూకి
గ్రక్కదలు నీటితో చిక్కువడు నీటితో
నీటి గుబురులు కట్టెనే విరిపూల
తోటలా తళు కొత్తెనే
తెర పొర్లుతో యీగి
కొను మర్లుతో తిర్గి
పడు దొర్లుతో కిన్నె
రటు తరలి యిటు తరలి
పావురా యెలుగుతో తీవలా యెలుగుతో
ఒత్తుకొని తరగొప్పెనే తరగల్లు
ఒత్తిల్లి తట మొత్తెనే
అడవిలో చిఱుపాయ
లై నాకలై సోన
లై జాలులై కిన్నె
రటు ప్రాకి యిటు ప్రాకి
దివ్య నృత్యములతో దివ్యనిస్వనముతో
దిగ్దిగంతము లంటెనే సురనదీ
దీప్తి దిక్కుల చిమ్మెనే
జిలుగు టందియలతో
కులుకు క్రొన్నడలతో
వెలది కిన్నెరసాని
పలుత్రోవలుగ బోయి
తెలిపూల తేనెవాకలు వారగాచేసి
తెనుగు వాగై పారెనే నెత్తావి
తెనుగు పాటలు పాడెనే.
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon