గోదావరీదేవి గుండె జలజల లాడి కవితా సాహిత్యం | కిన్నెరసాని పాటలు | విశ్వనాథ సత్యనారాయణ

గోదావరీ సంగమము కిన్నెరసాని కవిత


కవితా సంకలనం :: కిన్నెరసాని పాటలు

రచయిత :: విశ్వనాథ సత్యనారాయణ

కవిత పేరు ::గోదావరీ సంగమము



గోదావరీదేవి గుండె జలజల లాడి

ఆదగొని మనసు కదలాడీ జాలి

పాదులో పెల్లగిలి పూడీ కిన్నెరా

గేదంగి తెల్ల రేకెత్తు క్రొత్తరగలో

చాదుకొని పెనుతరగ లూగే ఆవాగు

నాదుకొని యామెవగ పాగే

గోదావరీ జాలిగుండె గూడులు కదలి

సాదుకిన్నెర కెదురుపోయీ ఆమె

లోదిగులు తరగ చేదోయీ వారించి

ఆదరముచే నామె నదిమి కౌగిట బూని

ఏదీ నీ మొగము నా తల్లీ అన్నదీ

నీదిగులు నిక మాను చెల్లీ

గోదావరీ పేదగుండె లోతులు కలగి

రాదగ్గరకు రమ్ము తల్లీ ఎంత

సాదువే నా ముద్దు చెల్లీ నీ వెన్ని

రాదగని కష్టాలరాశి మ్రగ్గితి వమ్మ

నీదు పతి శిలరూపు పొందీ నీవేమొ

ఓదె పనవాగుగా చిందీ

గోదావరీ జాలిగుండె ప్రేగులు తడిసి

నీ దుఃఖ మెంతదో తల్లీ నన్ను

నాదరువుగా నమ్ము చెల్లీ నిను చూచి

పేదలై లోకాలు పెద్దలై యేలేటి

జోదులే మతిచెడిరి తల్లీ నీయేడ్పు

రోదసిని నిండినది చెల్లీ

గోదావరీ యెడద కోసలను కోతవడి

రా దగ్గరకు రమ్ము తల్లీ కడలి

జోదింక నిను కనడు చెల్లీ నాతల్లి

నాదు గర్భమున నిన్నాదుకుని ఉంటాను

నీదు నెగులును పోవ చూడూ కడలి

నీదు జోలికి నింక రాడూ

గోదావరీదేవి కొస మనసులో నొరసి

ఏది నీయొడలు నాతల్లీ చేర్చు

నాదు కౌగింటిలో చెల్లీ తల్లి నీ

లేదలిరు కెరటాలు నాదుకాల్వల నింతు

నీదు బొట్టును కడలి కనడూ నాతల్లి

నీదు సంగతి కడలి వినడూ

గోదావరీ మహాకూలంకషామృత

శ్రీదివ్యమధుతరంగాలూ చిన్న

సాదు కిన్నెర తరంగాలూ కలసికొని

ప్రోదిగొను గంగా సరస్వతుల నీరములు

చాదుకొను తళుకు లురపించే చూడగా

సైదోడుతనము మెరిపించే

గోదావరీ దేవి కొస తళుకు ముత్తెముల

మాదిరి సెలంగు కెరటాలూ చిన్ని

సాదుకిన్నెర తరంగాలూ కలసికొని

లేదళుకు వెన్నెలలలో తలిరుమల్లికల

మూదలించిన యట్లు వొలచే అవ్వాని

పాదలించిన యట్లు వలచే

గోదావరీ దేవి కోరగించే మొగలి

వాదర హొరంగు కెరటాలూ చిన్ని

సాదు కిన్నెర తరంగాలూ కలసికొని

గోదుమలవన్నె తెలిక్రొత్త మబ్బుల జంట

ఊది కలిసినయట్లు పొలిచే అందాల

గాదిలి కవుంగిళులు మలచే

గోదావరీ దేవి కోలుమసగే నన్న

నాదు సేసే తరంగాలూ చిన్ని

సాదుకిన్నెర తరంగాలూ కలసికొని

వీదిలో పెద్దక్క పిన్నక్క నవ్వుల్ల

బోదె లొదిగినయట్లు పొలిచే రతనాల

బాదు లుంచిన యట్లు పొలిచే

గోదావరీదేవి గునిసియాడే మీను

లీదులాడే తరంగాలూ చిన్ని

సాదుకిన్నెర తరంగాలూ కలసికొని

మీది ఉయ్యాలలో మిసమిసను పసిపాప

మాదిరిగ కలసికొని వొలిచే నునుకాంతి

మేదురములై వెలుగు మెలిచే

గోదావరీదేవి కోరి కిన్నెరసాని

సాది తనలో కలుపుకొనెనూ నీటి

పాదులో గ్రుచ్చెత్తుకొనెనూ ప్రేమతో

నాదేవి యాచాన మోదాన కెరటాలు

సాదు నీరము కూడుకొనిరీ కోమలాం

భోదములవలె మొరసుకొనిరీ

గోదావరీ దేవి కోరి కిన్నెరసాని

సాది తనలో కల్పుకోగా కడలి

పాదుకోరిక పెల్లగిలగా కోపాన

ఆదేవి నదలించ నాలోచనము చేయు

కాదంచు మదిలోన నెంచూ మనసులో

వాదించు రంగు చెడు నంచూ

గోదావరీదేవి గొప్ప వంశపురాణి

కాదనేందుకు వీలులేదూ ఆమె

కాదన్నపని జేయరాదూ అందులో

ఏది తనదెస న్యాయ మేదారి నాదేవి

కాదన్నపని మంచిదనునూ లోకాలు

వాదించితే మెప్పు గనునూ

గోదావరీదేవి గొప్పగుణముల చాన

వాదుపొందేపనుల రాదూ న్యాయ

మేదారి విడి యెందు పోదూ అందులో

ఆదేవి మున్ను సీతారాము లొకరొకరి

నేదుకొను నెడబాటు నెరుగూ పరుల క

ష్టాదులకు మదిలోన మరుగూ

గోదావరీదేవి కోరి కిన్నెరసాని

సాది తనలో కలుపుకొన్నా కడలి

యేది చేయగలేక యున్నా అందరూ

ఓ దొరా నీకిట్టు లీదిగులు కాదయా

కాదు పతిభక్తలను కోరా ఆవాగు

పేదరా లది నీకు మేరా

గోదావరీదేవి కొను సప్తఋషుల బి

డ్డాదివాహిని తప్పుకోదూ తప్పు

నేదునే గాని కైకోదూ నీవు సి

గ్గేది కోపింతువా యేమొగముపెట్టుకొని

పోదు వాదేవికడ కింకా ఏరీతి

నాదేవికొఱ మాన్తువింకా

గోదావరీదేవి కూడి కిన్నెరసాని

సైదోడుగా మారినంతా కోర్కె

కేదారి మాయ మయినంతా తనపొంగు

మై దించుకొని కడలి లో దించుకొని కడలి

మీది పొంగు కుదించుకొనెనూ లోలోన

నాదుగా తెగ మొరసికొనెనూ

గోదావరీ నీరు కూడి కిన్నెర నీరు

ఏది యేదో తెలియనంతా కోర్కె

కేదారి మాయమయినంతా తొల్లింటి

సాదురూపము పొంది సాగి చెలియలికట్ట

కేదో మెలమెల్లగా చెప్పూ పడవలకు

పో దారిగా నీర మొప్పూ

గోదావరీదేవి కూడి కిన్నెరసాని

యేదిగులు లేక తెలివొందే చల్ల

సాదుతరగల గుములు చిందే మనిసిగా

నేదారినో చచ్చుటేగదా మరి యిందు

లేదు చావో తనకునైనా అనుకుంది

లేదు చావును మగనికైనా.

Share This :



sentiment_satisfied Emoticon