కడలి పొంగు కవిత కిన్నెరసాని పాటలు
కవితా సంకలనం :: కిన్నెరసాని పాటలు
రచయిత :: విశ్వనాథ సత్యనారాయణ
కవిత పేరు ::కడలి పొంగు
గాలిపిల్లలెపోయి వూదెనో
మొగిలు కన్నెలుపోయి చెప్పెనో
తగని కోరికచేత తనలో కడలిరాజు
సొగసు కిన్నెరసాని చూడాలె ననిపించి
ఉఱ్ఱట్ట లూగెనూ
మిఱ్ఱెక్కి చూచెనూ
మిసమిసని మింటికై పొంగెనూ
మసక మసకల కళ్లు విప్పెనూ
ఎంత దూరానుందొ యీ చిన్ని పడుచంచు
సంతోసమే మేను సకలమ్ముగా మారి
మిరిమిర్రి చూచెనూ
బొటవ్రేళ్ళ నిలచెనూ
ఉబికి కెరటా లూగులాడెనూ
గుబురులై ఉప్పొంగిపోయెనూ
తన యొడల్తన కేమొ తెలియ నట్లయిపోయి
తరుణి కిన్నెర అందమే లోక మయిపోయి
సళ పెళా కాగెనూ
గల గలా వూగెనూ
తన నీటిగుణ మెందు పోయెనో
తన చల్లదన మెందు దాగెనో
పరగ తనలో నున్న బడబాగ్ని శిఖ పొంగి
తన శరీరమ్మెల్ల దహియించి నట్లుగా
తటపటయి పోయెనూ
తపియించి పోయెనూ
గంగ తన యిల్లాలు కాదటే
యమున తన యిల్లాలు కాదటే
ఎంతమందీ లేరు ఇన్ని యేళ్ళూ వచ్చి
చిన్ని వాగులు చూచి చిత్త మెరియించుకో
తనకు నిది తగదూ
కడలి రాజునకూ
ఏనాటి ముసలి యీ కడలీ
ఏనాటి పెద్ద యీ కడలీ
తిరిగి నలుగురిలోన తిరుగ నేర్చినవాడు
పరగ కామమునకై బడలిపోయె నటన్న
తన కేమి పరువూ
కడలి రాజునకూ
తన కున్న మరియాద యెంతా
తన కున్న గౌరవం బెంతా
లోకాలు తప్పుత్రోవల పోవునాయేని
సర్ది చెప్పగలట్టి సామంతు డీ రాజు
తానుగా దిగెనా
తప్పుదారులకూ
అన్ని వాగులవంటి దగునా
అన్ని తోగులవంటి దగునా
మంచి కిన్నెరసాని మగని కెక్కినచాన
కొంచెమేమో పొంది కోపమిట్లయినంత
తన్ను పొందునటే
తనకు దక్కునటే
వాగుగా తా నెప్పుడైనదో
తోగుగా తా నెప్పుడైనదో
జలజలా స్రవియించి బిలబిలా ప్రవహించి
కడలి రాజు హొరంగు కౌగింటిలో దూరు
టపుడె వ్రాసినదీ
అన్ని వాగులకూ
అని పొంగిపోయెనూ కడలీ
అని వూగులాడెనూ కడలీ
తనపైన తారాడు పడవ లల్లలనాడి
వచ్చె నంచు తుఫాను భయ మంది కుందగా
తెరచాప లూగా
కెరటాలు క్రమ్మా
కెరటాలు పొంగినా కడలీ
తరగ లూగాడినా కడలీ
సొగసు కిన్నెరసాని చూ పందుకొనుటకై
గగనమ్ము కొసదాక కెరటాలు వుబికించి
దూరాలు చూచెనూ
బారలూ చాచెనూ
పొంగి పోయిన కడలి చూచీ
మిన్ను ముట్టిన కడలి చూచీ
ఈ అకాలపువేళ యేమో కడలి పొంగి
పోయెబో లోకాలు ముంచి వేయునో అంచు
కళవళం పడెనూ
జగము లన్నీనూ
ఊగులాడిన కడలి చూచీ
ఉబికి పోయిన కడలి చూచీ
ఉప్పు పెనగా వచ్చి ఉర్వి అంతా పొంగి
తెప్పలై నేలపై తేలియాడునో అంచు
కళవళం పడెనూ
జగము లన్నీనూ
అదుగదుగో బాడబము పొంగే
అదుగదుగో నేలపై వచ్చె
అని మానిసులు పిరికితనముగా చెప్పుకొని
మేనిలో ప్రాణాలు బిగియగా పట్టుకొని
కదలిపోవరహో ఒకరొకరి
వదలిపోవరహో
వచ్చె వచ్చెనటన్న కడలీ
ఎంత చూచినను అట్లే నిల్చిపోవగా
ఎంతసేపటికి అట్లే నిల్చి ఉండగా
పిరికితగ్గినదీ
జగము లన్నిటికీ
ఎట్లు పొంగిన దట్లు పొంగీ
ఎట్లు నిల్చిన దట్లు నిల్చీ
ఒకనీటిబొట్టయిన ఉరలి నేలకు రాక
కడలి అచ్చోటనే కదలకుండుట చూచి
పిరికి పోయినదీ
కొంతసేపటికీ
కడలి పొంగిన దంతెకానీ
కడలి ఉబికిన దంతెకానీ
కడలి తా చెలియలీకట్ట దాటునె యంచు
కడలిమాత్రము బద్దె గడచిపోవునె యంచు
కడగి యనుకొనిరీ
బుడుత మానిసులూ
అన్ని విధముల లోక మాడెనూ
అన్ని రీతుల జగము చెప్పెనూ
చిన్ని కిన్నెరసాని చిత్తాన పొగ లెగయు
క్రొన్నిప్పుకలులోన కుమిలించి దహియించు
టెవ్వ రెఱుగుదురూ
నవ్వేటి జనులూ
కడలి మిన్నుల తాకు చూచీ
కడలి తరగల వూగు చూచీ
కడలి తనకోసమై బడలుపడిపోవు నని
కడలి తనపై వలపు కమ్ముకొనివచ్చె నని
కిన్నె రెరిగినదీ
కీడు తలచినదీ
మనసులో పెద్దదిగులుట్టీ
ఎదలోన పెద్దవగ పుట్టీ
కదలిపోయెడి నీరు గడ్డకట్టించుకో
సాగిపోయెడి నీరు సాగ కింకించుకో
బిట్టు కోరినదీ
బిట్టు కుందినదీ
ఓ నాథ నిను వీడి వచ్చీ
ఓ రాజ నిను వదలి వచ్చీ
నా యొడల్సయితమ్ము నానాజనులు కోర
యీ యేవపుంబ్రతు కేల పొందితినిరా
అంచు వగచినదీ
అంచు లురలినదీ
అచటనే నిలిచిపో నెంచూ
అచటనే ఆగిపో నెంచూ
కాని నీటిగుణమ్ము కదలిపోవునె గాని
చాన కిన్నెరకోర్కె సాగించునే తాను
జలజలా కదలీ
బిలబిలా కదలీ
రాయడ్డముగ చేసి నిలుచూ
పొదలడ్డముగ చేసి యాగూ
ఇంత నిల్చితి నంచు నెంచి లో నుప్పొంగి
పొంత పొంతలరాళ్ళు పొదలు పైపైపొంగి
అడవి పరుగెత్తూ
అంతలో నేడ్చూ.
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon