అనుదినమ్మును కాఫీయే అసలుకిక్కు పాట లిరిక్స్ | మిథునం (2012)

 చిత్రం : మిథునం (2012)

సంగీతం : స్వరవీణాపాణి 

సాహిత్యం : జొన్నవిత్తుల 

గానం : జొన్నవిత్తుల 


అనుదినమ్మును కాఫీయే అసలుకిక్కు..

కొద్దిగానైన పడకున్న పెద్దచిక్కు

కప్పు కాఫీ లభించుటే గొప్పలక్కు

అమృతమన్నది హంబక్కు

అయ్యలారా..ఆఆఆ...


జై కాఫీ... విశ్వాంతరాళంబులోనున్న

బ్రహ్మాండ గోళాలలో నీకు సాటైన

పానీయమే లేదు ముమ్మాటికీ..

అందుకే నిన్ను కట్టేసుకుంటాము మా నోటికీ..

నాల్కతో నీకు జేజేలు పల్కేము నానాటికీ..


ఎర్లీ మార్నింగులో నిద్ర లేవంగనే

పాచి పళ్ళైనయున్ తోమకన్ త్రాగు బెడ్ కాఫీ

కోసంబు పెండ్లాముపై రంకెలేయించకే బెస్టు టేస్టీశ్వరీ..


ఫ్రెష్షు కాఫీశ్వరీ నెస్సు కేఫీశ్వరీ జిహ్వకున్

సిద్ధి చేకూర్చవే బ్రూకు బాండేశ్వరీ...

లోక ప్రాణేశ్వరి ప్రాణ దానేశ్వరి గంటగంటా

ప్రతీ ఇంట ఉప్పొంగవే ఉష్ణ పానేశ్వరీ..


స్టీలు ఫిల్టర్ల పళ్ళెంబులోనున్న రంధ్రాలలో నుండి

నీ సారమంతా సుతారంగా జారంగ నోరూర

చూడంగ నా సామిరంగా నిజంగానె చచ్చేవిధంగా..

కాస్త తాగన్ పునర్జన్మ వచ్చే విధంగా..


ప్రొద్దు ప్రొద్దున్నే నీ పొందు లేకున్న

మూడంతా పాడయ్యి టైమంత వేస్టయ్యి

కచ్చెక్కి పిచ్చెక్కి అశ్లీల సంభాషణల్ చేసి

కాంటాక్ట్సు సర్వంబు నాశమ్ము కావించుకొంటారుగా...

అందుకే నిన్ను అర్జంటుగా తెచ్చుకొంటారుగా..

దాచుకొంటారుగా కాచుకొంటారుగా చచ్చినట్టింక

ఇచ్చేంత సేపందరున్ వేచి ఉంటారుగా...


కాఫీనంతెత్తు పైనుంచి ఓకప్పులోవంచి

ఆ కప్పులోనుంచి ఈ కప్పులో పోసి

అట్నుంచి ఇంట్నుంచి ఇట్నుంచి అట్నుంచి

బాగా గిలక్కొట్టుచున్ నుర్గు ఉప్పొంగగా

తెచ్చి ఇస్తారుగా..


గొప్ప నిష్టాగరిష్టుల్ బరిస్తాలలోనన్

గరిష్టంబుగా కాఫీ తాగేందుకిష్టంబుగా పోవుగా..

షాపు మూసేయ వాపోవుగా..

సర్వ కాఫీ రసాంగీ సుదాంగీ శుభాంగీ

ప్రభాంగీ నమస్తే నమస్తే నమస్తే నమః

Share This :



sentiment_satisfied Emoticon