అంతా రామమయం, దశరథనృపతికి - అంతా రామమయం పాట లిరిక్స్ | సీతాకళ్యాణం (1976)

చిత్రం : సీతాకళ్యాణం (1976)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : బాలు, పి.బి. శ్రీనివాస్‌, రామకృష్ణ, పి.సుశీల, వసంత




అంతా రామమయం, దశరథనృపతికి - అంతా రామమయం.
రాముని తోటిదె లోకం, రామునిపైనే ప్రాణం
రాముని పేరే వేదం - రూపే మోదం
పలుకులె మోహన గానం,
కన్నది మాత్రం కౌసల్యయినా కైకే రాముని తల్లి,
అరక్షణమైనా రాముని విడిచి బ్రతకదు రెండవ తల్లి,

అంతా రామమయం కైకా దేవికి అంతా రామమయం

విద్దెము విద్దెములాడే రాముని ముద్దులు చూడాలి
ముద్దిమ్మంటే ముందుకు ఉరికే మురిపెం చూడాలి
అడిగినదేదో ఇవ్వకపోతే - అల్లరి చూడాలి
మరి పంతాలు పెట్టేవేళ మారాం చూడాలి
పట్టిన పంతం చూడాలి బెట్టూ బింకం చూడాలి
కోరిన కోరిక తీరేవేళ గోమును చూడాలి గోమును చూడాలి..
అందని చంద్రుని కిందికి దించిన అమ్మను చూడాలి
చంద్రుని చూచి నవ్వే యింకో చంద్రుని చూడాలి
రామచంద్రుని చూడాలి

అంతా రామమయం కైకా దేవికి అంతా రామమయం

ఏదీ ఏదీ, ఇంతటి వరకూ యిచటే వున్నది
ఇంతలో ఏమైనదమ్మా, ఏదీ ఏదీ ఏదీ - సీతమ్మ
చిట్టి పొట్టి ముద్దుల మూట చిన్నారి పొన్నారి సీతమ్మ,
అవును అవును అందాల రాశి కామునిగన్న మాయమ్మ,
అల్లన మెల్లన పారాడుతుంటే హంసధ్వనులే ఓయమ్మ,
ఘల్లు ఘల్లు గజ్జెలమోత చల్లని గానమె అవునమ్మా,
అహరహము పూజాగృహమున హరి మనోహర విగ్రహమునె
బాల జానకి తనివితీరా చూసుకుంటుంది
ఆ నీలవర్ణుని పొందు ఎపుడని ఎదురుచూస్తుంది.

జానకి రాముల కలిపే విల్లు, జనకుని ఇంటనె ఉన్నది
ఆ యింటికి ఆ వింటికి, ఘనమగు కథ యొకటున్నది
తారకాసురుని తనయులు ముగ్గురు దారుణ బలయుతులు
విపరీతమ్మగు వరములు పొంది, కట్టిరి త్రిపురములు
ఆ కోటల చుట్టూ పెట్టిరి ఎన్నో రక్కసి రక్షణలు
ఎదురు లేదని చెలరేగిరి - ఆ త్రిలోక కంటకులు
దారుణ హింసలు తాళజాలక తల్లడిల్లి సురలు
హిమాలయమ్మున త్రినేత్రధారికి తెలిపినారు మొరలు
సర్వదేవమయ సర్వమహేశ్వర - శరణు శరణు శరణు
శత్రుభయంకర పాప లయంకర శరణు శరణు శరణు
పాహిమాం పాహిమాం పాహిమాం..
గర్వాంధులు ఆ త్రిపురాసురుల - కడతేర్ప నిదే అదను
పాహిమాం పాహిమాం పాహిమాం,
పాహిమాం పాహిమాం పాహిమాం,

మేరు పర్వతము వింటిబద్దగా ఆదిశేషుడే వింటి నారిగా,
నలువరాణియే వింటి గంటగా నారాయణుడే వింటి శరముగా,
అమరెను శివునికి విల్లు.. అసురుల ఆయువు చెల్లు,
అమరెను శివునికి విల్లు.. అసురుల ఆయువు చెల్లు,

చండ ప్రచండ అఖండ బలుండగు గండరగండడు శివుడు,
కొండరథముపై కొండవింటితో దండిమగల చెండాడె.
దండిమగల చెండాడె.
Share This :



sentiment_satisfied Emoticon