అనగనగా ఒక ఊరు . ఆ ఊరిలో ఒక పేద కుటుంబం ఉండేది. ఆ కుటుంబ యజమాని సీతయ్య . ప్రతి రోజూ అతను దగ్గరలోని అడవికి వెళ్ళి, కట్టెలు కొట్టుకొచ్చి, వాటిని గ్రామంలో అమ్మి, తన కుటుంబాన్ని పోషించేవాడు. అంత పేదరికంలో కూడా ఇతరులకు సాయపడేవాడు.
ఒక ఏడాది కరువు వచ్చి పంటలు సరిగ్గా పండలేదు. ఊళ్లో జనాల దగ్గర డబ్బు లు తక్కువ అవ్వటంతో, ఆ ప్రభావం సీతయ్య కట్టెల వ్యాపారం మీద పడింది. కట్టెలు కొనేవాళ్ళ సంఖ్య బాగా తగ్గి పోయింది. సీతయ్య కుటుంబానికి పూట గడవటమే కష్టమైపోయింది.
ఒకనాడు సీతయ్య కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. కట్టెలు కొడుతుండగా మధ్యలో దాహం వేసింది. దగ్గర్లోని చెలమకు పోయి, నీళ్ళు తాగి, "అమ్మా! ఎంత కష్టంవచ్చిందమ్మా నాకు!" అని నిట్టూర్ఛాడు. వెంటనే ఒక వనదేవత ప్రత్యక్షమయింది: 'ఏమి కావాలో కోరుకో'మన్నది!
సీతయ్య తన కష్టాలన్నింటినీ ఆ దేవతకు చెప్పుకున్నాడు. అప్పుడు వనదేవత సీతయ్యకు మూడు టెంకాయలు ఇచ్చి "ఈ మూడు టెంకాయలనూ కొడుతూ నువ్వు ఏమి కోరుకుంటే అది జరుగుతుంది నాయనా" అని చెప్పి మాయమై పోయింది.
సీతయ్య సంతోషంగా ఇంటికి వెళ్ళి టెంకాయలను కొడుతూ, తనకు ఒక పెద్ద భవనమూ, దండిగా సంపదా, తమ ప్రాంతం మొత్తానికి సకాల వర్షాలు కావాలని కోరుకున్నాడు. అతని కోరిక ప్రకారమే అన్నీ జరిగాయి.
సీతయ్య ఇంటి పక్కనే ఒక పిసినారి పుల్లయ్య ఉండేవాడు. వ్యాపారంలో బాగా సంపాదించి డబ్బులు కూడ బెట్టాడు అతను. అతనికి రెండు గాడిదలు ఉండేవి. అవంటే అతనికి ఎంతో ఇష్టం కూడాను.
కట్టెలుకొట్టే సీతయ్య ఒక్క రోజులో షావుకారి అయిపోవడం పిసినారి పుల్లన్నకు ఆశ్చర్యం కలిగించింది. సీతయ్య దగ్గరికీ వెళ్లి 'విషయం ఏంటి' అని ఆడిగాడు. పుల్లయ్య అంటే గౌరవభావం ఉన్న సీతయ్య, ఏమీ దాచుకోకుండా జరిగినదంతా చెప్పేశాడు అతనికి.
మరుసటి రోజు పిసినారి పుల్లన్న అడవికి బయలు దేరిపోయి, నీటి చెలమ దగ్గర కూర్చొని "అమ్మా! ఎంత కష్టం వచ్చిందమ్మా నాకు!" అని మొత్తుకున్నాడు. వెంటనే వనదేవత ప్రత్యక్షమైయింది; సీతయ్యకు ఇచ్చినట్లే మూడు టెంకాయలను ఇచ్చి మాయమై పోయింది.
పుల్లన్న ఇంటికి వెళ్ళి , మొదటి టెంకాయ కొట్టబోతున్నాడు. అంతలో ఒక బిక్షగాడు వచ్చి ఇంటి బయట నిల్చొని, " బాబూ! ధర్మం బాబూ !" అని అరిచాడు.
"శుభమా , అని టెంకాయ కొడుతుంటే, వీడొకడు తగలబడ్డాడు" అని కోపగించుకున్న పుల్లన్న, కొబ్బరికాయను కొడుతూనే, "నువ్వొక్కడివీ వస్తే ఎలా సరిపోతుంది గాడిదా, మరో వెయ్యి గాడిదల్ని వెంట బెట్టుకు రాకపోయావూ!?" అన్నాడు వెటకారంగా.
టెంకాయ మహత్యం! మరుక్షణం పుల్లన్న ఇల్లంతా గాడిదలతో నిండిపోయింది.
"ఇదేమిటీ, ఇలా జరిగింది?" అని కంగారు పడ్డాడు పుల్లన్న . ఆ కంగారులో రెండవ టెంకాయను కొడుతూ "అమ్మా! ఈగాడిదలన్నింటినీ తీసేసుకోమ్మా!" అన్నాడు. తక్షణం అతని సొంత గాడిదలతో సహా అక్కడున్న అన్ని గాడిదలూ మాయమయ్యాయి.
"అయ్యో! నాప్రియమైన రెండు గాడిదలు! అవి పోతే ఎలా?" అంటూనే మూడవ టెంకాయను కొట్టాడుపుల్లన్న. కళ్లుమూసి తెరిచేసరికి, అతని రెండు గాడిదలూ అతనికి తిరిగి వచ్చేశాయి!
మూడు టెంకాయలు అయిపోయాయి- కానీ వనదేవతవల్ల ఏ లాభమూ పొందలేకపోయాడు, పాపం పుల్లన్న! ఆ తర్వాత అతను ఎంత నిట్టూర్చినా వనదేవత మాత్రం ప్రత్యక్షం కాలేదు
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon